Friday, July 30, 2010

శ్రీ కృష్ణ దేవరాయ పంచ శతాబ్ది పట్టాభిషేక మహోత్సవాలు - బంగారుపాలెం




లలిత కళా సమాఖ్య, రాయల్ పబ్లిక్ స్కూల్ వారి సంయుక్త ఆధ్వర్యములో సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్రభోజుడు, మూరు రాయర గండడు తదాది బిరుదులు కలిగి ప్రజాను రంజకుడైన శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది మహోత్సవాలు బంగారుపాలెం రాయల్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణ మందు జరిగిన సందర్భములో నేను రచించిన కొన్ని పద్యాలు...

||సీ|| రాయలేలినసీమ రతనాల సీమయై
తెలుగు నేలను తీర్చి దిద్దె నాడు
రాయల పాలన రమణీయమై సుఖ
శాంతుల నలరారె జగతినాడు
అష్ట దిగ్గజముల నాస్థానమున నిల్పి
భువన విజయమును పోషించెనాడు
స్త్రీలను చెరబట్టి హింసించుటలు మాని
మర్యాద మన్ననల్ నడచెనాడు

||ఆ.వె|| విజయనగర శోభ విశ్వవిఖ్యాతమై
దేశదేశముల సందేశమగుచు
ధరణి పతులకెల్ల నాదర్శ ప్రాయమై
నిలచియున్నది గద నేటివరకు ||౧||

||మ|| ఇది మా రాయలసీమ, చంద్రగిరి నాడీరీతి తానొప్పెగా
నది మారాజుల కోట తిమ్మరుసు మంత్రాంగంబు రాజిల్లగన్
సదయల్ మించిన రాజ్యపాలనమునన్ స్వారాజ్య సంస్ఫూర్తి కో
విదులున్ మెచ్చగ గృష్ణ రాయ లిటకున్ విచ్చేసి పాలించెగా ||౨||